బెంగాల్లో 80.43 శాతం పోలింగ్
బెంగాల్ రెండో దశ కూడా భారీగానే పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాకు పోలింగ్ జరగగా 80.43 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా నందిగ్రామ్‌లో భారీగా ఓటింగ్ జరగడం గమనించాల్సిన అంశం. నందిగ్రామ్‌లో 80 శాతం పోలింగ్ జరిగిందని ఈసీ ప్రకటించింది. కుతూల్పూర్ నియోజకవర్గంలో 87 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఇండస్, పత్తార్ ప్రతిమ నియోజకవర్గాల్లో 86 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే పలుచోట్ల తృణమూల్ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఏకంగా పోలింగ్ బూత్ నుంచే గవర్నర్‌కు ఫోన్ చేసిన సీఎం
ఎన్నికల సందర్భంగా నందిగ్రామ్‌లో బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సుబేందు కాన్వాయ్ పై దాడి కూడా జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న తృణమూల్ అభ్యర్థి, సీఎం మమతా బెనర్జీ ఓ పోలింగ్ స్టేషన్‌ను సందర్శించారు. ఓటు హక్కు వినియోగించుకోడానికి ప్రజలను పోలింగ్ బూత్‌లోకి రానివ్వడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా నేరుగా గవర్నర్ ధన్కర్కు ఫోన్ చేశారు. ‘‘సామాన్య ప్రజానీకాన్ని పోలింగ్ బూత్‌లోకి రానివ్వడం లేదు. ఓటు హక్కును వినియోగించుకోనివ్వడం లేదు. ఉదయం నుంచీ నేను ప్రచారంలోనే ఉన్నా. కాస్త ఈ విషయంపై దృష్టి పెట్టండి.’’ అంటూ మమత గవర్నర్‌ను కోరారు. యూపీ, బిహార్ నుంచి వచ్చిన మనుషులు పోలింగ్ బూత్ ముందు నానా హంగామా సృష్టిస్తున్నారని మమత తీవ్రంగా మండిపడ్డారు.













