విమానాశ్రయాల్లో మాస్క్ లు లేకుండా కన్పిస్తే…
దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది. కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులను విమానాల నుంచి దించేయాలని ఇప్పటికే విమానయాన సంస్థలను ఆదేశించిన డీజీసీఏ.. తాజాగా ఎయిర్పోర్టులకు సూచనలు చేసింది. విమానాశ్రయాల్లో మాస్క్ లు లేకుండా కన్పించేవారిపై తక్షణ జరిమానాలు విధించాలని సూచించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ జారీ చేసింది.
ఎయిర్పోర్టు ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా విమానాశ్రయ నిర్వాహకులు చూసుకోవాలి. ముక్కు నోటిని కవర్ చేసేలా మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం వంటి నియమాలను పాటించేలా చూడాలి. ఈ అంశాలపై అన్ని ఎయిర్పోర్టులు మరింత నిఘా పెంచాలని కోరుతున్నాం. నిబంధనల ఉల్లంఘనలను నిరోధించేందుకు అవసరమైన శిక్షార్హమైన చర్యలు కూడా తీసుకునే అంశాన్ని పరిశీలించండి. స్థానిక పోలీసు అధికారుల సహకారంతో నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం తక్షణ జరిమానాలు విధించండి అని డీజీసీఏ విమానాశ్రాయ నిర్వాహకులను సూచించింది.













