ఆజాద్ స్థానంలోకి మల్లికార్జున ఖర్గే…. ఎందుకంటే…
రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా సీనియర్ నాయకుడైన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. గతంలో ఆయన లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. మల్లికార్జున ఖర్గే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పార్టీలో సీనియర్ కావడం, విషయాలపై అవగాహన ఉన్న నేపథ్యంలో ఆయన్ను రాజ్యసభకు పంపింది కాంగ్రెస్. మొన్నటి వరకూ రాజ్యసభలో కాంగ్రెస్ నేతగా గులాంనబీ ఆజాద్ వ్యవహరించారు. ఈ నెల 15తో ఆయన రాజ్యసభ సభ్యత్వ కాలం ముగుస్తుంది. ఈ సందర్భంగానే ప్రధాని మోదీ ఆజాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా కన్నీరు కూడా పెట్టుకుంటూ… సెల్యూట్ చేశారు. ‘‘గులాంనబీ ఆజాద్ అంటే నాకెంతో గౌరవం. విపక్షంలో ఉన్నప్పటికీ హుందాగా మాట్లాడతారు. ఎప్పుడూ అసభ్యపదజాలం వాడరు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా. కొత్తగా సభకు వచ్చేవారు ఆయన నుంచి స్ఫూర్తిని పొందవచ్చు. ఆయన నాకు నిజమైన స్నేహితుడు. అంటూ కన్నీరు పెట్టుకుంటూ మోదీ ఆజాద్‌కు సెల్యూట్ కూడా చేశారు. అయితే రాజ్యసభలో మరో ముగ్గురు కాంగ్రెస్ ఉద్ధండులు కూడా ఉన్నారు. ఒకరు… ఆనంద్ శర్మ, దిగ్విజయ్ సింగ్, చిదంబరం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇంత మంది సీనియర్లు వరుసబెట్టి ఉన్నా…. అధిష్ఠానం మాత్రం ఖర్గేను మాత్రమే నియమించింది.
ఖర్గేనే ఎందుకు నియమించారంటే…..
మల్లికార్జున ఖర్గే కర్నాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత. పైగా అపారమైన అనుభవం ఉన్నవారు. అధిష్ఠానానికి నిత్యం విధేయుడిగానే ఉంటారు. విధేయత, ఓపిక, అనుభవం… ఈ మూడు రంగరించి ఉన్న కారణంగా అధిష్ఠానం ఈయనకు అవకాశం ఇచ్చింది. 2004 లో కర్నాటకలో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. బీజేపీని ఎదుర్కోడానికి జేడీయూతో కాంగ్రెస్ చేతులు కలిపింది. అప్పుడు ధరంసింగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే ఎస్.ఎం.కృష్ణ కేబినెట్లో ఖర్గే నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. దీంతో కాస్త అప్సెట్ అయ్యారు. ఆయన మద్దతు దారులకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. అంతే స్థాయిలో బాహాటంగానే అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. కానీ… ఖర్గే మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు. నేనెప్పుడూ పార్టీ అధిష్ఠానానికి విధేయంగానే ఉంటానని ప్రకటించారు. అంతేకాకుండా ధరంసింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. ఈ సంఘటన అధిష్ఠానాన్ని బాగా ఆకర్షించిందని ఆయన వర్గీయులు పేర్కొంటారు. ఆ తర్వాత 2008 ఎన్నికల్లో ఖర్గే నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ ఘోర పరాభవాన్నే మూటగట్టుకుంది. యడియూరప్ప అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చుంది. అందరూ ఖర్గేను దుమ్మెత్తిపోశారు. అధిష్ఠానం మాత్రం ఆయన్ను ఏమీ అనలేదు. పైగా తమకు ఆయనపై అపారమైన నమ్మకం ఉందని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, లేకపోయినా…. ఖర్గే మాత్రం అధిష్ఠానానికి అత్యంత విధేయతను ప్రదర్శిస్తుంటారు.
‘దళిత నేత’ అని సంబోధిస్తే అస్సలు ఇష్టపడరు…..
ఏ నేత అయినా ఆయన్ను దళిత నాయకుడు అని సంబోధిస్తే ఆయనకు అస్సలు ఇష్టముండదు. ‘‘అవును.. నేను దళితుడ్నే. అది నిజమే. కష్టపడే మనస్తత్వం, స్వశక్తితోనే ఇంత స్థానానికి వచ్చాను. అందరూ నాకు మద్దతిచ్చారు. కాంగ్రెస్ నేత… అని నన్ను పిలవండి. దళిత నేత అని మాత్రమే పిలవకండి. అది అవమానంగా నేను భావిస్తా.’’ అని ఖర్గే పదే పదే చెబుతుంటారు. అంతేకాకుండా ఆయన ఢిల్లీ రాజకీయాల్లో ఎదిగే క్రమంలో చాలా మంది మీడియా వారు, ఆయన వ్యతిరేక వర్గం వారు ఆయనపై అనేక విమర్శలు చేశారు. అయినా సరే.. ఆయన ఎక్కడా అదరలేదు. బెదరలేదు. వారందరి అంచనాలను, విమర్శలను తారుమారు చేస్తూ… సభలోగానీ, బయటగానీ అత్యంత హుందాగా ప్రవర్తించారు. విషయంపై స్పష్టమైన అవగాహనతో మాట్లాడారు. చివరికి ఖర్గే ప్రవర్తనను చూసి ప్రధాని మోదీ బహిరంగంగానే ప్రశంసలు కురిపించారు. ఇక… కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఆయన పరిజ్ఞానంపై, వ్యవహార శైలిపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.













