అమెరికా వర్సిటీలో సీటు సాధించిన ప్రజ్ఞ… ఘనంగా సన్మానించిన సీజే
సుప్రీంకోర్టులో పని చేస్తున్న వంట మనిషి కుమార్తె ప్రజ్ఞ (25) అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. న్యాయశాస్త్రంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు ఇతర న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రాంగణంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, దేశానికి సేవలందించాలని వారు ఆకాంక్షించారు. భారత రాజ్యాంగంపై రచించిన మూడు పుస్తకాలపై వారంతా సంతకాలు చేసి, ఆమెకు బాహూకరించారు. స్వయంకృషి, పట్టుదలతో ప్రజ్ఞ ఈ స్థాయికి చేరుకున్నారని, భవిష్యత్తులో ఆమెకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. పిల్లలు వారి కలలు నెరవేర్చుకొనేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులపైనా ఉందని సూచించారు.













