ముగ్గుర్ని కాదని, కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చిన ప్రధాని మోదీ

దేశంలోనే అత్యంత కీలకమైన సీబీఐ చీఫ్ పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ దాదాపు వీడినట్లే. సీనియర్ ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను నియమించుతున్నట్లు తెలుస్తోంది. తదుపరి సీబీఐ చీఫ్ ఎవరిని నియమించాలన్న అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక భేటీ జరిగింది. ఈ భేటీకి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, లోకసభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి హాజరయ్యారు. వీరు ముగ్గురూ కలిసి ఓ జాబితాను షార్ట్‌లిస్ట్ చేశారు. యూపీ డీజీపీ హెచ్‌సీ అవస్థి, సశస్త్ర సీమాబల్ డీజీ కేఆర్ చంద్ర, హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శి వీఎస్‌కే కౌముది పేర్లను షార్ట్‌లిస్ట్ చేసేశారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారన్నది ఖాయమైంది. కానీ 24 గంటల్లోనే ప్రధాని మోదీ తన మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గుర్నీ కాదని, మరో అధికారి పేరును తెరపైకి తెచ్చారు. వాస్తవానికి 100 మంది అధికారుల పేర్లతో ఈ పదవికి జాబితాను రూపొందించారు. అందులో ముగ్గుర్ని షార్ట్‌లిస్ట్ చేశారు. అయితే సీబీఐ చీఫ్ పదవిని చేపట్టే ఏ అధికారి పదవి కాలమైనా 6 నెలలుండాలి. ఈ మేరకు సుప్రీం కోర్టు గతంలో తీర్పునిచ్చింది. సరిగ్గా ఇదే పాయింట్ ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా 6 నెలల లోపే పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర సభ్యులు మరో అధికారి పేరును తెరపైకి తెచ్చారు. ఆయనే సుబోధ్ కుమార్.
సుబోధ్ కుమార్ జైస్వాల్ సీనియర్ ఐపీఎస్ అధికారి. 1985 బ్యాచ్ అధికారి. గతంలో మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు. ముంబై పోలీస్ కమిషనర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) లో కూడా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 9 సంవత్సరాల పాటు ఇంటెలిజెన్స్‌లో సమర్థవంతంగా బాధ్యతలు చేపట్టీారు.