ఉన్న ఒక్క పదవినీ కోల్పోయిన చిరాగ్ పాశ్వాన్
కన్నుమూసి, కన్ను తెరిచే లోగా చిరాగ్ పాశ్వాన్‌కు దెబ్బ పడుతోంది. హఠాత్తుగా ఎల్జేపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తిరుగుబాటు చేసి, ఝలక్ ఇచ్చి, 24 గంటల్లోగా మరో పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. లోక్‌జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి చేజారిపోయింది. ఆ పదవి నుంచి చిరాగ్ పాశ్వాన్‌ను తొలగిస్తున్నట్లు తిరుగుబాటుదారులకు నేతృత్వం వహిస్తున్న చిరాగ్ బాబాయ్ పశుపతినాథ్ పారస్ ప్రకటించారు. ఈ మేరకు తిరుగుబాటు ఎంపీలందరూ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అధ్యక్ష పదవి నుంచి చిరాగ్‌ను తొలగిస్తున్నామని సంచలన ప్రకటన చేశారు. లోక్‌జనశక్తి పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఇకపై పశుపతి కొనసాగుతారని ప్రకటించారు. ఎల్జేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంసీ సూరజ్ భాన్ సింగ్ ఉంటారని ప్రకటించారు. దీంతో చిరాగ్ ఖిన్నుడయ్యారు. తమను ప్రత్యేక ఎంపీలుగా గుర్తించాలని, ఎల్జేపీ నేతగా పశుపతినాథ్ పారస్‌ను ఎన్నుకున్నామని ఎల్జేపీకి చెందిన ఐదుగురు ఎంపీలు స్పీకర్‌కు తెలియజేశారు. దీంతో పశుపతినాథ్‌ను ఎల్జేపీ పక్షానికి నేతగా గుర్తిస్తూ లోక్‌సభ సెక్రెటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఒంటరైన యువనేత చిరాగ్…
పార్టీలో ఒక్కసారిగా చీలిక రావడంతో యువనేత చిరాగ్ పాశ్వాన్ ఒంటరయ్యారు. సరిగ్గా ఎన్నికల సమయంలో తండ్రి, అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. అయినా చిరాగ్ అధైర్యపడలేదు. ప్రధాని మోదీ ఉన్నారన్న ధీమాతో ఎన్నికల్లో అత్యంత చురుగ్గా ఎన్నికల్లో పాల్గొన్నారు. సీఎం నితీశ్‌పై ఒంటికాలితో లేచారు. నితీశ్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయినా తండ్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణంతో చిరాగ్ ఒంటరయ్యారు. అతి త్వరలో కేంద్ర మంత్రివర్గంలో చిరాగ్‌కు మంత్రి పదవి కూడా దక్కబోతోందని వార్తలొచ్చాయి. ఇంతలోనే పార్టీ నిట్టనిలవునా చీలిపోవడంతో ఏం చేయాలో యువనేతకు తోచడం లేదు. బీజేపీ, ప్రధాని మోదీ అండగా ఉంటారని చిరాగ్ భావించినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా…. బీజేపీ ఏక వాక్యంతో స్పందించి, సరిపెట్టుకుంది. ఎల్జేపీ అంతర్గత వ్యవహారమని, తమకు సంబంధంలేదని బీజేపీ ప్రకటించింది.













