ఎంపీ నవనీత్ కౌర్ కు… బాంబే హైకోర్టు షాక్

మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, ప్రముఖ నటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆమె ఎంపీ పదవి ప్రమాదంలో పడింది. నవనీత్ కౌర్ నకిలీ పత్రాలతో ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం పొందారని శివసేన మాజీ ఎంపీ ఆనందరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రం అబద్దమని హైకోర్టు గుర్తించింది. ఈ మేరకు తీర్పునిచ్చిన ధర్మాసనం రూ.2 లక్షల జరిమానా చెల్లించి, ఆరు వారాల్లోగా అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది. మహారాష్ట్రలోని అమరావతి లోక్‍సభ స్థానం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. నవనీత్ నకిలీ సర్టిఫికెట్‍తో లోక్‍సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిపించారని ఆనందరావు ఆరోపించారు.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన నవనీత్‍కౌర్.. ఎన్సీపీ తరపున ఎన్నికల బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అమరావతి లోక్‍సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నవనీత్ కౌర్ పలు తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ చిత్రాల్లో కూడా నటించారు.