‘ఈ పేలుళ్లు ఓ ట్రయిలర్ మాత్రమే’.. లేఖను గుర్తించిన అధికారులు
‘ఈ పేలుళ్లు ఓ ట్రైలర్ మాత్రమే… ముందుంది అసలు కథ’ అని ఉన్న ఓ లేఖను ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద అధికారులు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లు ఓ ట్రైలర్ మాత్రమేనని, అసలు కథ ముందున్నదన్న సారాంశం ఆ లేఖలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇరాన్ జనరల్ ఖాసిం సొలిమనీ, శాస్త్రవేత్త మొహిసిన్ ఫక్రిజదేహలను అమరవీరులుగా ఈ లేఖలో అభివర్ణించారు. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయంలోని అధికారులనుద్దేశించే అగంతకులు ఈ లేఖను రాసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ పేలుళ్లకు తమదే బాధ్యత అని జైష్ ఉల హింద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ పేలుడు తమపనేనని ఈ సంస్థ ప్రకటించింది.
భారత్ పై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించిన ఇజ్రాయిల్
ఈ దాడి ఉగ్రదాడి కావొచ్చని ఇజ్రాయిల్ రాయబారి పేర్కొన్నారు. భారత అధికారులపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఈ దాడిపై పూర్తి దర్యాప్తు జరుగుతోందని, దోషులను మాత్రం విడిచిపెట్టమని ఇజ్రాయిల్ రాయబారి స్పష్టం చేశారు. ఈ పేలుళ్లు యాదృచ్ఛికమేమీ కాదని, ఓ పద్ధతి ప్రకారం జరిగిన దాడులే అని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం పేర్కొంది.
రంగంలోకి ‘నేషనల్ సెక్యూరిటీ గార్డ్’
ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించిన నేపథ్యంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్.ఎస్.జీ) రంగంలోకి దిగింది. పేలుళ్లు సంభవించిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. పేలుడు ఎలా జరిగింది, వ్యక్తులను గుర్తించే పనిలో నిమగ్నమైంది ఎన్ఎస్జీ.













