బెంగాల్లో అధికారంలోకి వస్తే వ్యాక్సిన్ ఫ్రీ : బీజేపీ
బెంగాల్లో తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ను అందిస్తామని బెంగాల్ బీజేపీ హామీ ఇచ్చింది. వచ్చే నెల 5 నుంచి అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని సీఎం మమత ప్రకటించిన తర్వాత బీజేపీ ఈ హామీని ఇవ్వడం గమనార్హం. ‘‘పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ టీకా అందిస్తాం’’ అని బెంగాల్ బీజేపీ ట్వీట్ చేసింది.
కౌంటర్ ఇచ్చిన టీఎంసీ
బెంగాల్లో అధికారంలోకి రాగానే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామన్న బీజేపీ ప్రకటనపై అధికార తృణమూల్ గట్టి కౌంటర్ ఇచ్చింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే రకమైన హామీ ఇచ్చారని, ప్రజలను ఫూల్స్ చేశారని ఎద్దేవా చేసింది. మళ్లీ ఫూల్స్ కావడానికి బెంగాల్ ప్రజలు సిద్ధంగా లేరని, బీజేపీ మాటలు నమ్మవద్దని తృణమూల్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.













