టాటాసన్స్ కు అనుకూలంగా సుప్రీం తీర్పు
టాటా గ్రూపు, సైరన్ మిస్త్రీ మధ్య వివాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీకి భారీ షాక్ తగిలింది. టాటాసన్స్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గతంలో సైరన్ మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా నియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును నిలిపివేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉన్నారు. గతేడాది డిసెంబర్ 17న ఈ కేసులో తీర్పును రిజర్వులో ఉంచింది. 2016లో మిస్త్రీని చైర్మన్‌గా తొలగిస్తూ టాటాసన్స్ బోర్డు తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదని 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ తీర్పు వెలువరించింది. మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా నియమించాలని సూచించింది.
2020 జనవరి 2వ తేదీన టాటాసన్స్ ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఆ తర్వాత రతన్ టాటా కూడా ఎన్సీఎల్ఏటీ తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. అదేనెల 10వ తేదీన సుప్రీం కోర్టు ఎన్సీఎల్ఏటీ తీర్పుపై స్టే విధించింది. సెప్టెంబర్ 22న టాటాసన్స్ లో షేర్లను షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఎక్కడా తాకట్టు పెట్టకుండా న్యాయస్థానం అడ్డుకొంది. గతేడాది డిసెంబర్ 8న తుది వాదనలను విన్నది. అదే నెల 17న తీర్పును రిజర్వులో పెట్టింది. నేడు టాటాసన్స్ వాదనలను బలపరుస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2012లో రతన్ టాటా తర్వాత టాటా సన్స్ చైర్మన్ అయిన సైరస్ మిస్త్రీని 2016లో బోర్డు తొలగించింది. టాటా సన్స్‌లో మిస్త్రీ కుటుంబానికి 18.37 శాతం వాటా ఉంది.













