ప్రాణాలైనా ఇస్తాం కానీ… పార్టీకి ద్రోహం చేయం
బీజేపీ ప్రలోభాలకు లొంగి ఆప్ ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేయరని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కాషాయ పార్టీని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఆప్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు విఫలయత్నం చేసిన బీజేపీ ఆపై తమ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. ఈడీ, సీబీఐలతో బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. ఆప్‌ను చీల్చేందుకు బీజేపీ తాజా కుట్రకు తెరలేపిందని అన్నారు. బీజేపీ ఇలాంటి పనులకు దూరంగా ఉంటే మంచిదని అన్నారు. తాము అరవింద్ కేజ్రీవాల్ మనుషులమని, భగత్ సింగ్ బాటలో నడిచేవారమని స్పష్టం చేశారు. తాము ప్రాణాలైనా వదులుతాము కానీ పార్టీకి ద్రోహం చేయబోమని పేర్కొన్నారు. తమ ముందు ఈడీ, సీబీఐ తోకముడవాల్సిందేనని వ్యాఖ్యానించారు.













