బంగ్లా చేతిలో ఓడి.. సెమీస్ రేసు నుంచి శ్రీలంక అవుట్!
వరల్డ్ కప్లో శ్రీలంక కూడా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో మూడు వికెట్ల తేడాతో శ్రీలంక ఓటమి చవిచూసింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు అనుకున్న ఆరంభం దక్కలేదు. కీలక ప్లేయర్లు కుశాల్ పెరీరా (4), కుశాల్ మెండిస్ (19) విఫలమయ్యారు. అయితే పాథుమ్ నిస్సంక (41), సదీర సమరవిక్రమ (41), చరిత్ ఆసలంక (108), ధనంజయ డి సిల్వ (34), మహీష తీక్షణ (21) రాణించారు. దీంతో ఆ జట్టు 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో తంజీమ్ హసన్ సాకిబ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. షోరిఫుల్ ఇస్లామ్, షకీబ్ అల్ హసన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. మెహదీ హసన్ మిరాజ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లా కూడా తడబడింది. తంజీద్ హసన్ (9), లిటాన్ దాస్ (23) విఫలమయ్యారు. అయితే నజ్ముల్ హసన్ షాంటో (90), షకీబల్ హసన్ (82) రాణించారు. మిగతా బ్యాటర్లు లాంఛనం పూర్తి చేయడంతో బంగ్లా జట్టు 41.1 ఓవర్లలలోనే 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచులో లంక వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ కనీసం ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరాడు. టైంలోగా అతను క్రీజులోకి రాలేదని భావించిన బంగ్లా టీం అప్పీల్ చేయగా.. అంపైర్లు అతన్ని ‘టైమ్ అవుట్’గా ప్రకటించారు. మాథ్యూస్ క్రీజులోకి వచ్చిన తర్వాత అతని హెల్మెట్ స్ట్రాప్ తెగింది. దీంతో అతను మరో హెల్మెట్ కోసం వెయిట్ చేయడంతో ఇది జరిగింది. దీనిపై ప్రస్తుతం నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. బంగ్లా టీం ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఫ్యాన్స్ అంటున్నారు.













