చరిత్ర సృష్టించిన ఆసీస్.. నెదర్లాండ్స్‌పై 309 పరుగుల తేడాతో విజయం
వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా హిస్టరీ క్రియేట్ చేసింది. నెదర్లాండ్స్‌ను చిత్తుగా ఓడించింది. పసికూనపై ఏకంగా 309 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరల్డ్ కప్ చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం కావడం గమనార్హం. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ వార్నర్ (104), స్టీవెన్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (62) రాణించారు. చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (106) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించి, వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగంగా శతకం బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో ఆ టీం నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. డచ్ ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (25) మినహా ఎవరూ కనీసం 15 పరుగుల మార్కు కూడా దాటలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో కేవలం మూడు ఓవర్లే వేసిన ఆడమ్ జంపా ఏకంగా నాలుగు వికెట్లు తీసుకొని సత్తా చాటాడు. దీంతో నెదర్లాండ్స్ కేవలం 90 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. బ్యాటుతో రెచ్చిపోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













