శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. వరల్డ్ కప్‌లో మూడో విజయం
వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండో విజయం సాధించింది. శ్రీలంకతో పూణే వేదికగా జరిగిన మ్యాచులో అన్ని విభాగాల్లో అదరగొట్టి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తొలుత బౌలింగ్ వేసిన ఆఫ్ఘన్ టీం.. శ్రీలంక బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. దీంతో ఆ టీంలో ఒక్కరు కూడా తమకు దక్కిన ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. శ్రీలంక బ్యాటర్లలో పాథుమ్ నిస్సంక (46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఫ్ఘన్ బౌలర్లు రాణించడంతో లంక టీం 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేజింగ్‌లో ఆఫ్ఘన్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న రహ్మనుల్లా గుర్బాజ్ (0) డకౌట్ అయ్యాడు. అయితే ఇబ్రహీం జద్రాన్ (39), రహ్మత్ షా (62), హష్మతుల్లా షాహిదీ (58 నాటౌట్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (73 నాటౌట్) అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరంతా రాణించడంతో ఆఫ్ఘన్ జట్టు 45.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. బంతితో చెలరేగిన ఆఫ్ఘన్ పేసర్ ఫజల్హాక్ ఫరూఖీ (4/34)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇది ఓవరాల్‌గా వరల్డ్ కప్‌లో ఆఫ్ఘన్ సాధించిన మూడో విజయం కావడం గమనార్హం.













