అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ… అందుకే కేంద్రం అంగీకారం
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అదానీ వివాదంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పెట్టుబడిదారుల భద్రతను నిర్ధారించేందుకు కమిటీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని సెబీ చూస్తోందని కోర్టుకు తెలిపారు. స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ వంటి ఆరోపణలను హిండెన్‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు రిరైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీని వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఇంతకు ముందు సుప్రీంకోర్టు విచారణ జరిపి, కమిటీ ఏర్పాటుకు కేంద్రం స్పందన కోరింది. ఈ క్రమంలో విచారణ జరగ్గా కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో కమిటీ సభ్యులను సూచించాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది.













