అమెరికాలో కొత్త వైరస్
అగ్రరాజ్యం అమెరికాలో కొత్తరకం వైరస్ ప్రబలుతోంది. దీనిని హ్యూమన్ మెటా న్యుమో వైరస్ (హెచ్ఎంపీపీ)గా పేర్కొంటున్నారు. ఇదొక శ్వాసకోశ వైరస్. దీనికి ఇప్పటి వరకు నిర్దిష్ట వ్యాక్సిన్ అంటూ లేదు. అమెరికాలో దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. చాలా మందిలో వైరస్ సోకిందనే విషయాన్ని గుర్తించడం కూడా కష్టంగా ఉందని అక్కడి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీఎస్) గత వారం దేశవ్యాప్తంగా హెచ్ఎంపీవీ కేసుల పెరుగుదలను గుర్తించింది. మార్చిలో పరీక్షించిన నమూనాలలో సుమారు 11 శాతం హెచ్ఎంపీవీ పాజిటివ్‌గా తేలాయి. ఇది సాధారణ మహమ్మారి పూర్వ స్థాయిల కంటే 36 శాతం అధికం. కొవిడ్ వైరస్ మాదిరిగానే ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది.
ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల్లోనూ వేగంగా వ్యాపిస్తోంది. ఎక్కువ మందిలో జలుబు లక్షణాలు కనిపిస్తుంటాయని, రెండు నుంచి ఐదు రోజుల వరకు ఈ వైరస్ లక్షణాలు ఉంటాయని సీడీఎస్ పేర్కొంది. ఆరోగ్యవంతులు వారంతటా వారే రికవరీ అవుతుండగా, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ఇది ప్రభావాన్ని చూపుతున్నట్లు వైద్య వర్గాలు వెల్లడిరచాయి. దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ఉంటాయి. కరోనా వైరస్ మాదిరే ఇది కూడా ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాప్తి చెందుతుంది.













