శ్రీలంక నౌకాదళ మాజీ కమాండర్ పై అమెరికా ఆంక్షలు
ఎల్టీటీఈతో సాగిన పోరులో తీవ్రస్థాయిలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ శ్రీలంక నౌకాదళంలో మాజీ సీనియర్ కమాండర్ వసంత కరన్నగోడపై అమెరికా ఆంక్షలు విధించింది. దీనిపై శ్రీలంక ప్రభుత్వం మండిపడింది. ఇది ఏకపక్ష చర్య అని వ్యాఖ్యానించింది. వసంత 2005 నుంచి 2009 వరకూ నౌకాదళ కమాండర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన జపాన్‌లో శ్రీలంక రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం శ్రీలంకలో ఒక ప్రావిన్స్‌కు గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. 2020లో అమెరికా ఇదే రీతిలో ప్రస్తుత శ్రీలంక త్రిదళాధిపతి జనరల్ షవేంద్ర సిల్వాపై ఆంక్షలు విధించింది. దీనిప్రకారం అమెరికాలో సంబంధిత వ్యక్తుల ఆస్తులను స్తంభింపజేస్తారు. వారితో పాటు వారి సన్నిహిత బంధువులు కూడా అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టడానికి అనర్హులు.













