ఇరాన్‌పై అగ్రరాజ్యం మరోసారి కొరడా
శత్రు దేశమైన ఇరాన్‌పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆంక్షల కొరడా ఝుళిపించింది. ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని షరతులకు నూతన ఆంక్షలను జోడిస్తున్నట్లు అమెరికా కార్యదర్శి మైక్ పాంపియో వెల్లడించారు. ట్రంప్ అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలను సడలించడం అనాలోచిత, ప్రమాదకరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. ఇరాన్‌తో తిరిగి సత్సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై ఆంక్షల విధింపు ప్రాముఖ్యత పేరిట ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ చేసే విధ్వంసకాండ వల్ల సతమతమయ్యే దేశాలను ఏకతాటిపైకి తెచ్చి నూతన మధ్య ప్రాచ్యాన్ని సృష్టించాలన్న ఆకాంక్షలో భాగంగానే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు పాంపియో వెల్లడించారు.
నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసేలోగా ఇరాన్‌పై మరిన్ని ఆంక్షల విధింపును ట్రంప్ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. అమెరికన్ల ప్రాణాలను కాపాడుకోవడానికి, జాతి భద్రతను సంరక్షించుకోవడానికి ఈ ఆంక్షలు కీలకమైన ఆయుధంగా పనిచేస్తాయని పాంపియో తెలిపారు. మరోవైపు, ఇరాన్‌కి చెందిన మొస్తాజఫాన్ ఫౌండేషన్, దానికి అనుబంధంగా ఉన్న 160పైగా సంస్థలను తాజా ఆంక్షల్లో లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా కోశాగార విభాగం పేర్కొంది.













