మాతృభూమి అభివృద్ధికి కృషి చేయాలి.. ప్రవాసులకు జస్టిస్ రమణ పిలుపు
దుబాయిని అభివృద్ధి చేసినట్లుగా అదే సంకల్పంతో మాతృభూమిని అభివృద్ధి చేయడానికి కూడా ప్రవాసులు కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పిలుపునిచ్చారు. స్వదేశానికి బయలుదేరడానికి ముందు దుబాయిలోని తెలుగు సంఘం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. అరబ్బుల మనస్సులో ప్రవాస భారతీయులు తమకంటూ ఒక ప్రశంసనీయమైన చోటు సంపాదించుకోవడం తనకు అమిత ఆనందాన్ని కలిగించిందని అన్నారు. తన మూడు రోజుల పర్యనటలో యూఏఈ వ్యాప్తంగా తనతో సమావేశమైన స్థానిక అరబ్బు న్యాయమూర్తులందరూ భారతీయుల కృషిని ప్రశంసించారన్నారు. చిత్తశుద్ది ఉంటే అభివృద్ధి ఏవిధంగా సాధ్యమో యూఏఈని చూస్తే తెలుస్తుందన్నారు. ఇరు దేశాల మధ్య ఖైదీల పరస్పర బదిలీ, నేరస్థుల అప్పగింత ఒప్పందాలపై తాను యూఏఈ అదికారులతో చర్చించానని తెలిపారు. తీర్పుల అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒక సారీ సమీక్షించాల్సిన అవశకత ఉందని తెలిపారు.













