ఈ కష్ట సమయంలో భారత్ కు అండగా ఉంటాం
గుజరాత్లోని మోర్బీ తీగల వంతెన కూలి భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కమలా హారిస్ స్పందించారు. దుర్ఘటనపై ఇద్దరూ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో తాము భారతీయ ప్రజలకు అండగా నిలుస్తామని, మద్దతు ఇస్తామని తెలిపారు. భారత్లో వంతెన కూలిన ఘటనలో సన్నిహితులను కోల్పోయిన కుటుంబాలకు జిల్ (బైడెన్ భార్య), నేనూ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో మేము భారత ప్రజలకు అండగా నిలుస్తామని బైడెన్ తెలిపారు.
గుజరాత్లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిలో కేబుల్ వంతెన కూలిపోవడంతో 130 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఈ దుర్ఘటనపై తన సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి గురించి ఆలోచిస్తున్నానని ఆమె తెలిపారు.













