దానిపై అన్ని దేశాలు ఉక్కుపాదం మోపాలి : జైశంకర్ పిలుపు
అంతర్జాతీయ భద్రత, శాంతికి ఉగ్రవాదం నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. దానిపై అన్ని దేశాలూ ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. కొన్ని దేశాలు నిధుల సరఫరా ద్వారా ఉగ్రవాదం వ్యాప్తికి దోహదం చేస్తున్నాయంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లో బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సును ఉద్దేశించి జైశంకర్ ప్రసంగించారు. కీలక సమకాలీన అంశాలపై బ్రిక్స్ దేశాలు సమష్టిగా, నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఈ సంస్కరణల విషయంలో బ్రిక్స్ సభ్యదేశాలు చిత్తశుద్ధి ప్రదర్శించాలని సూచించారు.













