అమెరికా పౌరసత్వం… మౌఖిక పరీక్షలో ప్రశ్నల పెంపు
అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే వారు ఇకపై మౌఖిక పరీక్షలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సి ఉంటుంది. డిసెంబరు నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అమెరికా పౌరసత్వం-వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) పేర్కొంది. 2008 నుంచి ఇప్పటి వరకు మౌఖిక పరీక్షలో అమెరికా ప్రభుత్వం, భౌగోళిక స్వరూపం, పౌరుల హక్కులు-విధులు వంటి అంశాలపై 100 ప్రశ్నలు అడిగేవారు. ప్రతి 10 ప్రశ్నల్లో ఆరింటికి సరైన సమాధానం చెప్పాలనే నిబంధన ఉండేది. డిసెంబరు 1 నుంచి ఆ ప్రశ్నల సంఖ్యను 128కి పెంచనున్నారు. ప్రతి 20 ప్రశ్నల్లో పన్నెండింటికి సరైన సమాధానం చెప్పాలంటూ నిబంధనల్లో మార్పులు చేశారు. అంతేకాదు.. కొన్ని కీలక ప్రశ్నలకు ఐచ్చిక సమాధానాలు ఉండవు.













