ఇక వాటిని మర్చిపోవాలి.. కాదంటే ఎంతకైనా
ఉక్రెయిన్ సరిహద్దుల్లోని లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజియాలను తమ దేశంలో విలీనం చేసినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఆ నాలుగు ప్రాంతాల అధినేతలతో కలిసి ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందుకు సంబంధించిన విలీన ప్రక్రియను అధ్యక్ష భవనం క్రెమ్లిన్లోని సెయింట్ జార్జ్ హాలులో వేడుకగా నిర్వహించారు. సంతకాల తర్వాత పుతిన్, నలుగురు నేతలు చేయిచేయి కలిపి రష్యా రష్యా అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. వేడుకకు హాజరైన వందల మంది గొంతు కలిపారు. పుతిన్ మాట్లాడుతూ రెఫరెండాన్ని ఉక్రెయిన్ గౌరవించి, ఇకనైనా చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.
అయితే కొత్తగా విలీనమైన ప్రాంతాలను మాత్రం వదులుకోబోమని తెగేసి చెప్పారు. వాటిని మళ్లీ చేజిక్కించుకుందామనే ఆలోచనను విరమిచుకోవాలన్నారు. ఆ ప్రాంతాలపై దాడికి దిగితే, తమ భూభాగంపై దురాక్రమణకు దిగినట్టే భావిస్తామని అందుకు ప్రతిగా అన్ని సాధనాలనూ ప్రయోగిస్తామని హెచ్చరించారు. తద్వారా అణు దాడికైనా సిద్దమేనని పుతిన్ సందేశం ఇచ్చినట్టుయింది. వీలినానికి సంబంధించిన ఒప్పందాలను ఆమోదించేందుకు రష్యా పార్లమెంటు వచ్చేవారం సమావేశమవుతుంది. అనంతరం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై అధ్యక్షుని హోదాలో పుతిన్ సంతకాలు చేశారు.













