అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు…భారీ ఊరట
విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఊరట కలిగించే వార్త. అమెరికా వెళ్లేందుకు భారతీయ విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువపత్రం అవసరం లేదని అమెరికా దౌత్యాధికారి డాన్ హెఫ్లిన్ వెల్లడించారు. అయితే ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్ పరీక్ష చేయించుకుని నెగెటివ్ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అమెరికా వెళ్లడానికి వ్యాక్సిన్ ధ్రువపత్రం అవసరం లేకపోయినప్పటికీ అయా యూనివర్సిటీలు, స్కూళ్లు సొంత వ్యాక్సిన్ నిబంధనలు పాటిస్తాయని పేర్కొన్నారు.
విద్యార్ధులు ముందుగా తమ విద్యాసంస్థలను సంప్రదించి నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులకు తోడుగా వెళ్లే తల్లిదండ్రులను పర్యాటకులుగా వర్గీకరిస్తారని, అయితే కరోనా నేపథ్యంలో పర్యాటకులపై నిషేధం విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జూలై, ఆగస్టులలో వీలైనంత త్వరగా సాధ్యమైనన్ని విద్యార్థి వీసా దరఖాస్తులను పరిష్కరించేలా పనిచేస్తున్నట్టు చెప్పారు.













