Indian Deports: అమెరికా కాదు.. భారతీయులను వెనక్కి పంపడంలో ఈ దేశానిదే అగ్రస్థానం!
సాధారణంగా అక్రమ వలసలపై ఉక్కుపాదం.. భారతీయుల బహిష్కరణల (Indian Deports) వంటి వార్తలు విన్నప్పుడల్లా అందరి దృష్టి అమెరికాపైనే పడుతుంది. కానీ గత ఐదేళ్లలో అత్యధిక సంఖ్యలో భారతీయులను తిప్పి పంపిన దేశం అమెరికా కాదని, సౌదీ అరేబియా అని కేంద్ర విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు. గత ఐదేళ్లలో (2021-2025) సౌదీ అరేబియా అత్యధిక సంఖ్యలో భారతీయులను (Indian Deports) బహిష్కరించింది. భారతీయ మిషన్ గణాంకాల ప్రకారం, ఒక్క 2023లోనే 11,486 మందిని సౌదీ తిప్పి పంపగా, 2025లో ఇప్పటివరకు 7,019 మందిని వెనక్కి పంపింది. దీనికి ప్రధాన కారణం వీసా గడువు ముగిసినా అక్కడే ఉండటం (Overstay), కార్మిక చట్టాల ఉల్లంఘన అని అధికారులు తెలిపారు. సౌదీ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్న ‘ఇకామా’ (Iqama) నిబంధనలు, లేబర్ మార్కెట్ సంస్కరణల వల్ల ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా నుండి వెనక్కి వస్తున్న (Indian Deports) వారి సంఖ్య గల్ఫ్ దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. 2024లో యూఎస్ నుంచి 1,368 మంది బహిష్కరణకు గురికాగా, 2025లో ఆ సంఖ్య 3,414కు చేరింది. అయితే సౌదీ గణాంకాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అమెరికాతో పాటు ఇతర దేశాల నుండి కూడా వీసా నిబంధనలు ఉల్లంఘించిన వారిని మాత్రమే తిప్పి పంపుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.






