ఇరుదేశాల మధ్య సంబంధాలు నెలకొనడం అసాధ్యం : జై శంకర్
చైనాతో సాధారణ సంబంధాలు నెలకొనడానికి సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలే ప్రధానాంశాలని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. చైనా రాయబారి సన్ వీయింగ్ డాంగ్‌కి వీడ్కోలు చెప్పేందుకు ఏర్పాటైన సమావేశంలో ప్రసంగిచారు. చైనా, భారత్‌ల మధ్య సంబంధాలు మామూలు స్థాయికి రావాలని తమ దేశం కూడా కోరుకుంటోందన్నారు. అయితే అందుకు తగిన వాతావరణం ఏర్పడేటట్లు చూడాల్సిన బాధ్యత ఇరుదేశాలపైనా ఉందనీ తెలిపారు. ఏకపక్షంగా జరిగే ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఉండదని జైశంకర్ స్పష్టం చేశారు. ఆసియాలో పెద్ద దేశాలైన భారత్, చైనాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొనడం ఉభయతారకమే కాకుండా ప్రపంచదేశాల ప్రయజోనాలకు ఎంతోమేలు అని ఆయన అన్నారు. సరిహద్దుల్లో శాంతి వెల్లివిరియనంత వరకూ ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనడం అసాధ్యమని ఆయన అన్నారు.
సన్ వీయింగ్ డాంగ్ 2019లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో మన దేశానికి రాయబారిగా వచ్చారు. ఇప్పుడు ఇరుదేశాలు తమ మధ్య సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో స్వదేశానికి తిరిగి వెళ్తున్నారు అని జైశంకర్ అన్నారు. సన్ వీయింగ్ డాంగ్ ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా పరస్పరం గౌరవం ఇచ్చి పుచ్చుకునే రీతిలో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని సన్ వీయింగ్ డాంగ్ అన్నారు. ఇరు దేశాల మధ్య కొన్ని సమస్యలు, అపోహలు ఉండటం సహజమని అన్నారు.













