ఐరాస వేదికగా పాక్ కు భారత్ చురకలు
పొరుగువారిపై నిందలు వేసే ముందు తమ ఇంటిని తాము చక్కదిద్దుకోవాలని పాకిస్థాన్‌ను ఉద్దేశించి భారత్ తీవ్రంగా స్పందించింది. ఐరాస వేదికగా దాయాది దేశానికి చురకలు అంటించింది. భారత్ మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని పాక్ చేసిన ఆరోపణల నుద్దేశించి ఈ మేరకు స్పందించింది. పాకిస్థాన్ తన దేశం గురించి పట్టించుకోకుండా ఏది తప్పు? ఏది ఒప్పు? అని ప్రపంచానికి నీతులు చెప్పే పనిలో ఉంది. ముందు తమ ఇంటిని చక్కదిద్దుకోవాలనేది మా సూచన. అలాగే సొంత ప్రజల మానవ హక్కుల పరిరక్షణలో దారుణమైన రికార్డును మెరుగుపరుచుకోవాలి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అండర్ సెట్రకరీ జగ్ప్రీత్ కౌర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ జమ్మూకశ్మీర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆక్రమిత ప్రాంతం అనే పదం వాడారు. దీనిని భారత్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది.













