భారత్‍లో లాక్‍డౌన్ తప్పనిసరి…ఆ తర్వాత

భారత్‍లో కరోనా పంజా విసురుతోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. తొలిసారిగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఛీప్ మెడికల్ సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు దేశంలో కనీసం రెండు వారాలు లాక్‍డౌన్ పెట్టండి. ఆ తర్వాత చైనాలోలాగా తాత్కాలిక హాస్పిటల్స్ను నిర్మించండి. ఓ కేంద్ర వ్యవస్థను ఏర్పాటు చేయండి అని సూచించారు. కరోనాపై గెలిచేశామంటూ భారత ప్రభుత్వం చాలా ముందుగానే ప్రకటించిందని చురకలంటించారు. ఇండియాలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిపారు. సాధ్యమైనంత ఎక్కువ కాలం దేశంలో లాక్‍డౌన్ విధించండి. ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత అత్యవసరాలైన ఆక్సిజన్, ఇతర మందులు, పీపీఈ కీట్లు సమకూర్చుకోండి అని సూచించారు. దీనికి చైనా ఉదాహరణను ఆయన చెప్పారు.
గతేడాది అక్కడ ఇలాగే కరోనా విరుచుకుపడినప్పుడు దేశం మొత్తం లాక్‍డౌన్ విధించారు. వైరస్ సంక్రమణను అడ్డుకోవడానికి ఇది చాలా అవసరం. తర్వాత వ్యాక్సినేషన్ వేగం పెంచండి. గతంలో ఇండియా సాయం చేసింది కాబట్టి ఇప్పుడు అమెరికాతో పాటు చాలా దేశాలు సాయానికి ముందుకు వచ్చాయి అని ఫౌచీ అన్నారు. చైనాలాగే అత్యంత వేగంగా తాత్కాలిక హాస్పిటల్స్ను ఇండియా నిర్మించాలి. ఈ విషయంలో చైనాను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఇండియాలో హాస్పిటల్స్ చాలా అవసరం. మిలటరీ సాయం తీసుకోవడంపైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. అమెరికాలో వ్యాక్సిన్ల పంపిణీకి నేషనల్ గార్డ్ సాయం తీసుకున్నాం. ఇండియాలో ఇప్పటి వరకు కేవలం 2 శాతం మందికే వ్యాక్సిన్ ఇవ్వడం చాలా తీవ్రమైన అంశమని, ఏం చేసైనా వ్యాక్సినేషన్ వేగం పెంచాల్సిందే అని ఫౌచీ స్పష్టం చేశారు.