భారతీయులకు వీసా సులభతరం
జర్మనీ వెళ్లే భారత పౌరులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం అయింది. గతేడాదితో పోలిస్తే వీసా అపాయింట్మెంటుకు వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది. కేవలం రెండు నుంచి అయిదు రోజుల్లోనే వీసా అపాయింట్మెంటు లభిస్తుందని భారత్‌లోని జర్మనీ రాయబార కార్యాలయం వెల్లడించింది. వేగవంతమైన సేవలతో తక్కువ వ్యవధిలోనే వీసాలు జారీ చేస్తున్నామని తెలిపింది. భారత పౌరులకు వీసా జారీ ప్రక్రియను వేగవంతం చేయడం పట్ల సంతోషంగా ఉన్నామని భారత్‌లోని జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ తెలిపారు. గతంతో పోలిస్తే వీసా జారీ ప్రక్రియను వేగవంతంగా మెరుగుపరిచామన్నారు. ఈ ఏడాదిలో మరింత పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జర్మనీ శ్రామికశక్తి లోటును ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐటీ, హెల్త్‌కేర్, కాంట్రాక్ట్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. దీంతో సంస్థలు ఇతర దేశాల నుంచి నైపుణ్యం కలిగిన వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్నాయి.













