ఆస్ట్రేలియా కీలక నిర్ణయం .. వారికి ఐదేళ్ల జైలు, జరిమానా..
విదేశాల్లో ఉన్న తమ పౌరులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాము స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న తేదీకి 14 రోజులలోపు ఇండియాలో ఉన్న వాళ్లపై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడాన్ని నిషేధించింది. కాదని ఎవరైనా వస్తే వారికి ఐదేళ్ల జైలు, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. తమ పౌరులు స్వదేశానికి తిరిగి రావడమే శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. అయితే మే 3 నుంచి తమ ఆదేశాలను కాదని వస్తే జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ తెలిపారు. ఇది అంత సులువుగా తీసుకున్న నిర్ణయం కాదు. కానీ ఆస్ట్రేలియన్ల ఆరోగ్యం మాకు ముఖ్యం. క్వారంటైన్‌లోని కొవిడ్ కేసుల సంఖ్యను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మే 15 తర్వాత ఈ ఆంక్షలను మరోసారి సమీక్షించనున్నారు. ఇండియాలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఇండియా నుంచి ప్రయాణికులను అనుమతించకూడదని ఆస్ట్రేలియా నిర్ణయించింది. అయితే ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. యూకే, యూరప్‌లోనూ భారీగా కేసులు నమోదవుతున్నా.. వారిపై లేని ఆంక్షలు తమపై ఎందుకని ఆస్ట్రేలియన్ సర్జన్ నీలా జానకీరామన్ అన్నారు. ఇండియన్లు లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ఆమె అన్నారు.













