శ్రీలంకను ఓడించి.. ఆసియాడ్‌లో సెమీస్ చేరిన ఆఫ్ఘనిస్తాన్
ఆసియా క్రీడల్లో శ్రీలంకను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం కూడా సెమీఫైనల్లో అడుగు పెట్టింది. చైనాలోని హాంగ్జో వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ టీం కేవలం 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టీంలో నూర్ అలీ (51) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే శ్రీలంక బౌలర్ నువాన్ తుషార (4/17) ఈ టీమ్‌ను దెబ్బతీశాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక తడపడింది. ఆఫ్ఘన్ బౌలర్లు ఖైస్ అహ్మద్, గుల్బాదిన్ నైబ్ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. దీంతో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన శ్రీలంక 19.1 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో సెమీస్‌లో అడుగు పెట్టిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్ బెర్తు కోసం పాకిస్తాన్‌తో తలపడుతుంది. మరో సెమీస్‌లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. దీంతో ఫైనల్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.













