Ajit Doval: కెనడా అధికారులతో అజిత్ దోవల్ కీలక భేటీ!
ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య, దౌత్యవేత్తల బహిష్కరణలతో దాదాపు రెండేళ్లుగా స్తంభించిపోయిన భారత్-కెనడా సంబంధాలు మళ్ళీ గాడిన పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ బంధాలను పునరుద్ధరించే దిశగా భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval), తన కెనడా కౌంటర్ పార్ట్ నాథలీ డ్రౌయిన్తో (Nathalie Drouin) కీలక సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 7న ఒట్టావాలో జరిగిన ఈ భేటీ.. ఇరు దేశాల మధ్య ఏర్పడిన దౌత్యపరమైన మంచును కరిగించేందుకు తొలి అడుగుగా భావిస్తున్నారు.
ఇటీవలే కెనడా ఎనర్జీ మంత్రి భారత్కు వచ్చిన నేపథ్యంలో దోవల్ కెనడా పర్యటన కీలకంగా మారింది. ఈ సమావేశంలో ఇరు దేశాలు పరస్పర భద్రత, పౌరుల రక్షణకు సంబంధించిన అంశాలపై దోవల్ (Ajit Doval) చర్చలు జరిపినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. జాతీయ భద్రత, చట్ట అమలులో సహకారం కోసం ‘ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక’ (Shared Workplan)ను రూపొందించుకోవడానికి అంగీకరించాయి. సమాచార మార్పిడిని వేగవంతం చేయడానికి, కీలకమైన అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించుకోవడానికి ఇరు దేశాలు ప్రత్యేక లియాజన్ ఆఫీసర్లను (Liaison Officers) నియమించుకోవాలని నిర్ణయించాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సైబర్ భద్రతా విధానం, మోసాలు, ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ వంటి అంశాల్లోనూ సహకారాన్ని అధికారికం చేయాలని నిర్ణయించారు. 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) చేసిన ఆరోపణలు పెను దుమారం రేపాయి. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనతో దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు తిరిగి సయోధ్య దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.
త్వరలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) కూడా భారత్లో పర్యటించే అవకాశం ఉందని సమాచారం. ఇంధనం, విద్య, టెక్నాలజీ వంటి రంగాల్లో సహకారం కోసం ఆయన మార్చిలో భారత్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య తిరిగి సానుకూల వాతావరణాన్ని నెలకొల్పుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.













