అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. జార్జియా రాష్ట్రంలో ఒక ఇంటిలో టీనేజర్లు జరుపుకున్న పార్టీలో కాల్పులు జరగడంతో ఇద్దరు మృతి చెందారు. డగ్లస్విల్ కౌంటీలో ఈ దారుణం జరిగింది. టీనేజర్ల మధ్య రేగిన తగవు చివరకు కాల్పులకు దారి తీసినట్లు స్థానిక పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. దీనికి బాధ్యులు ఎవరో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షులను ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో ఇంటిలో 100 మందికి పైగా టీనేజర్లు ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలో ఇంటిలో పెద్దలు ఎవరైనా ఉన్నారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపింది ఒకరా? లేక ఎక్కువ మందా? అనేది తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.













