ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విటర్లో ప్రకటించింది. ఉదయం రొటీన్‌గా కొవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నప్పుడు ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్ అని తేలింది. లక్షణాలేమీ లేవు. హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. ఆయన సతీమణి ఉషకు నెగటివ్ వచ్చింది. ఆమె ఐసోలేషన్లోకి వెళ్లారు అని కార్యాలయం పేర్కొంది. వెంకయ్యనాయుడుకు కరోనా అన్న విషయం తెలియగానే దేశవ్యాప్తంగా ఆయన శ్రేయోభిలాషులు, పార్టీల నేతలు స్పందించారు. త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపారు.
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌కుమార్‌దేబ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, అరుణ్ జైట్లీ కుమార్తె సోనాలి తదితరులు వెంకయ్య ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ట్వీట్లు చేశారు. తన తండ్రి యోగక్షేమాలను కాంక్షించిన అందరికి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆరోగ్య కొలమానాలన్నీ బాగున్నాయని, ఛాతీ, ఉపరితిత్తుల సీటీ స్కాన్‌లోనూ అంతా బాగుందన్నారు. దేవుడి దయ వల్ల వైరల్ లోడ్ చాలా తక్కువగానే ఉందని, అందుకే ఆయన్ను ఇంట్లోనే క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సలహా ఇచ్చినట్లు తెలిపారు.






