అమెరికాలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 11 లక్షల కేసులు!

అగ్రరాజ్యం అమెరికా కొవిడ్ కేసులతో వణికిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. ఒక్కరోజే (జనవరి 10) అమెరికాలో 11 లక్షల కేసులు వెలుగు చూశాయి. అంతుకుమందు జనవరి 3న ఒకేరోజు 10 లక్షల కేసులు బయటపడ్డాయి. తాజాగా ఆస్పత్రి చేరికలు కూడా భారీగా నమోదయ్యాయి. ఒకేరోజు లక్షా 35 వేల మంది ఆస్పత్రిలో చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రోజువారీ కేసుల్లో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ ఈ తరహా కేసులు నమోదు కాలేదు. వాషింగ్టన్ డీసీ, విస్కాన్‌సిన్, వర్జీనియా, డెలావేర్, ఇలినోయిస్, మేరిల్యాండ్, మిస్సౌరి, పెన్సిల్వేనియాతో పాటు పలు రాష్ట్రాల్లో ఆస్పత్రి చేరికలు అధికంగా ఉన్నాయి.
వైరస్ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఇన్‌ఫెక్షన్‌లు పెరిగితే వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నర్సులు, వైద్య సిబ్బందికి వైరస్ సోకినా స్వల్ప లక్షణాలు ఉన్నవారిని విధుల్లోకి వచ్చేలా పలు ఆస్పత్రులు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం ఇక్కడ పరిస్థితికి అద్దం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.