కరోనా పాపం చైనాదే : ట్రంప్
కరోనా పాపం చైనాదే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తికి చైనాదే బాధ్యతగా ఐక్యరాజ్య సమితి గుర్తించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఆన్లైన్లో చేరిన ట్రంప్ మాట్లాడుతూ చైనా వైరస్ కారణంగా 188 దేశాల్లో ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు. కనిపించని శత్రువు చైనా వైరస్‌తో తీవ్రమైన యుద్ధం చేశాం. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్న మనం ప్రపంచం మీదకు ప్లేగు లాంటి వ్యాధిని వదిలిన చైనాను, ఆ పాపం తనదే అని అంగీకరించేలా చేయాలని ట్రంప్ అన్నారు.
కరోనా వైరస్ చైనా లోనే పెట్టిందని, ఆ దేశ ప్రభుత్వం ఈ ప్రమాద కరమైన వైరస్ వ్యాప్తి విషయంలో బాధ్యతా రహితంగా వ్యవహరించిందని సృష్టం చేశారు. కోవిడ్ విషయంలో అమెరికా యుద్ద ప్రాతిపదికన స్పందించిందని, రికార్డు సమయంలో వెంటిలేటర్లను సమకూర్చడంతో పాటు, చాలా వేగంగా అత్యవసర చికిత్సలను అభివృద్ధి చేశామని, తద్వారా వ్యాధి కారణంగా జరుగుతున్న ప్రాణనష్టాన్ని 85 శాతం వరకూ తగ్గించగలిగామని ట్రంప్ వివరించారు. కోవిడ్ నివారణకు టీకాను అభివృద్ధి చేసిన తరువాత ప్రపంచం సరికొత్త శాంతి, సహకార, సమృద్ధతల్లో కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






