కరోనాను అడ్డుకునే నానోబాడీ
కొవిడ్-19పై పోరాడే సత్తా ఉన్న ఒక చిన్నపాటి నానో బాడీని శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ కణాల్లో ప్రవేశించకుండా కరోనా వైరస్‌ను అడ్డుకునే సామర్థ్యం దీనికి ఉందని వారు తెలిపారు. మహమ్మారికి యాంటీవైరల్ చికిత్సగా దీన్ని
ఉపయోగించొచ్చని పేర్కొన్నారు. స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
ఈ నానో బాడీలను న్యూట్రలైజింగ్ యాంటీబాడీలుగా పిలుస్తున్నారు. ఇవి సంప్రదాయ యాంటీబాడీలకు సంబంధించిన తునకలు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు.. ఆల్పాకా అనే జంతువులోకి కరోనా వైరస్‌కు సంబంధించిన స్పైక్ ప్రొటీన్‌ను చొప్పించారు. ఈ ప్రొటీన్ ఆధారంగా వైరస్.. మానవ కణాల్లోకి ప్రవేశిస్తుంటుంది. 60 రోజుల తర్వాత ఆల్పాకా నుంచి రక్త నమూనాలు సేకరించి, పరిశీలించారు. స్పైక్ ప్రొటీన్ నుంచి రక్షణ కల్పించే బలమైన రోగనిరోధక స్పందన అందులో కనిపించింది. తర్వాత ఆల్పాకాలోని ఒక రకం తెల్ల కణాల (బి సెల్స్) నుంచి నానోబాడీలను సేకరించి, వాటి తీరుతెన్నులను పరిశోధకులు విశ్లేషించారు. స్పైక్ ప్రొటీన్‌లోని ఒక భాగానికి అతుక్కొని, వైరస్‌ను నిర్వీర్యం చేసే సత్తా టీవై1 అనే నానోబాడీకి ఉందని గుర్తించారు.






