అమెరికాలో ఒమిక్రాన్ విజృంభణ.. క్రిస్మస్, న్యూయర్ నేపథ్యంలో ఆందోళన

అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటునప్పటికీ అది అంతకంతకూ విజృంభిస్తోంది. దీంతో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఆందోళన నెలకొంది అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో కొత్తగా లక్షా 81 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో అధిక శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని తెలిపింది. వారం రోజుల వ్యవధిలోనే అమెరికాలో ఒమిక్రాన్ వ్యాప్తి ఆరు రెట్లు పెరిగిపోయిందని తెలిపింది. కరోనా రోగుల్లో 24 గంటల్లో 1,811 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయని తెలిపింది.
అధ్యక్షుడు బైడెన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని తెలిపారు. త్వరలోనే ఉచితంగా 50 కోట్ల కరోనా ర్యాపిడ్ టెస్టులు చేస్తామని ప్రకటించారు. కరోనా బూస్టర్ డోసులు పంపిణీ చేస్తామన్నారు. ప్రజలందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా బూస్టర్ డోసు తీసుకున్నారని బైడెన్ ఈ సందర్భంగా గుర్తు చేయడం గమనార్హం.