దూసుకుపోతున్న అమెరికా.. నాలుగవ వంతు జనాభాకు వ్యాక్సిన్ పూర్తి

వాషింగ్టన్‍ః అమెరికాలో నాలువ వంతు జనాభాకు కరోనా వ్యాక్సిన్ వేయడం పూర్తయిందని ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సి.డి.సి) తెలియజేసింది. సుమారు 26.45 కోట్ల వ్యాక్సిన్ డోసులు విడుదల చేయగా అందులో 21 కోట్ల డోసులు వేయడం పూర్తయినట్టు ఆ సంస్థ తన తాజా బులెటిన్‍లో వెల్లడించింది.
సుమారు 12.25 లక్షల మందికి మొదటి డోసు వేయడం జరిగిందని, అందులో 8.25 కోట్ల మందికి రెండవ డోసు కూడా వేయడం పూర్తయిందని అది తెలిపింది. దేశంలో 39 శాతం మందికి మొదటి డోసు పూర్తి కాగా, 24 శాతం మందికి రెండవ డోసు కూడా ఇవ్వడం జరిగిందని అది తెలిపింది.
నిర్దేశిత లక్ష్యం దిశగా అమెరికా దూసుకుపోతోందని, వైద్య చికిత్సా సౌకర్యాలను కూడా గణనీయంగా మెరుగుపరచామని, అతి త్వరలో కరోనాను కొంత మేరకు కట్టడి చేయగలమన్న నమ్మకం కలుగుతోందని అధికారులు తెలిపారు. దేశాధ్యక్షుడుగా జో బైడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, 18.50 కోట్ల డోసులు ఇవ్వడం జరిగిందని, ఆయన అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యే లోపల 20 కోట్ల డోసులు ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని వైట్‍హౌస్‍లోని ఆరోగ్య అధికారులు తెలిపారు.
కాగా, ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల అతి దారుణంగా దెబ్బతిన్న దేశాలలో అమెరికా మొదటి స్థానంలో ఉందని జాన్స్ హాప్‍కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. అమెరికాలో ఇంత వరకూ 3.10 కోట్ల మంది ఈ వైరస్ బారిన పడగా, 5.60 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని అది పేర్కొంది.