హైదరాబాద్ లో ఉంటున్నారా.. మీకు కరోనా వచ్చినట్లే!

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఓవైపు వ్యాక్సీన్ రావడం.. మరోవైపు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పొచ్చు. అయితే భారత్ లో మాత్రం ఆ స్థాయి తీవ్రత కనిపించట్లేదు. దీంతో మిగిలిన దేశాలతో పోల్చితే ఇక్కడ కేసుల సంఖ్య తక్కువేనని చెప్పొచ్చు.
అయితే సీరో సర్వేల్లో మాత్రం ఆసక్తికర ఫలితాలు వెల్లడవుతున్నాయి. కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉంది.. దాని ప్రభావం ఎంత.. ఎంతమందికి కరోనా వచ్చి పోయింది.. అనే అంశాలు తెలుసుకునేందుకు సీరో సర్వేను నిర్వహిస్తున్నాయి పలు సంస్థలు. మన దేశంలో CSIR, CCMB లాంటి సంస్థలు పలు నగరాల్లో ఈ సర్వే చేపట్టాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక సమయంలో ఈ సర్వేలు జరుగుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఇప్పటికే సీరో సర్వేలు జరిగాయి. ఈ సర్వేల్లో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తాజాగా CSIR, CCMB, భారత్ బయోటెక్ సంస్థలు హైదరాబాద్ లో సంయుక్త సర్వే చేశాయి. దీన్ని బట్టి హైదరాబాద్ లో ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా వచ్చి పోయినట్లు తేలింది. ఇది ఆశ్చర్యం కలిగించే అంశం. దాదాపు 54 శాతం మందిలో యాంటీబాడీస్ ఉన్నట్టు సర్వేలో తేలింది. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. వీళ్లలో 75 శాతం మందికి తమకు కరోనా వచ్చి పోయిందనే విషయం కూడా తెలీదు. మీ శరీరంలో యాంటిబాడీలు ఉన్నాయనే విషయం చెప్పే వరకూ వాళ్లకు కరోనా సంగతి తెలీదు.
హైదరాబాద్ లో సుమారు 30 వార్డుల్లో ఈ సర్వే నిర్వహించారు. సుమారు 9వేల మంది రక్త నమూనాలు సేకరించారు. పదేళ్ల నుంచి 90 ఏళ్ల వృద్దుల వరకూ ఈ సర్వే చేపట్టారు. ఇందులో కొన్ని వార్డుల్లో 90 శాతం మందికి యాంటిబాడీలు ఉన్నట్టు తేలింది. అత్యల్పంగా కొన్ని వార్డుల్లో 30 శాతం మందికి కరోనా సోకి వెళ్లిపోయింది. చిన్న గదుల్లో ఎక్కువ మంది ఉంటున్నవారికి ఎక్కువగా సోకింది. అదే విశాలమైన గదుల్లో తక్కువ మంది ఉంటున్నవారికి తక్కువగా సోకినట్లు సర్వేలో నిర్ధారణ అయింది. పురుషులతో పోల్చితే మహిళల్లో ఎక్కువ యాంటీబాడీలు ఉన్నట్టు కూడా తేలింది.
ఒకప్పుడు తెలంగాణలో ఎక్కువ కేసులు హైదరాబాద్ లోనే నమోదయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రతి ఇద్దరిలో ఒకరికి యాంటీబాడీలు ఉండడం వల్లే కేసులు తక్కువగా నమోదవుతున్నట్టు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీకి చేరువైనట్లే. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. యాంటీబాడీలు ఉన్నవాళ్లకు.. అంటే కరోనా వచ్చిపోయిన వాళ్లెవెరకీ మళ్లీ కరోనా సోకలేదు. ఆ లెక్కన హైదరాబాద్ వాసులు సేఫ్ జోన్ లోనే ఉన్నట్టు భావించవచ్చు.