వ్యాక్సిన్ సరఫరాకు అవాంతరాలు

ప్రపంచ దేశాలను ఆటాడిస్తున్న కరోనా వ్యాక్సిన్
బ్రసెల్స్‌ః ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ నుంచి అనుమతి రానందువల్ల అమెరికాలో పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ జరగడం లేదని తెలిసింది. ఫలితంగా లక్షలాది కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులు సరఫరా కేంద్రాలలోనే పడి మూలుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. అమెరికా మిత్రదేశాలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ జో బైడెన్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడానికి కూడా ఇదే కారణమని వారు చెబుతున్నారు.
ఆస్ట్రాజెనెకా నుంచి రెండు డోసుల వ్యాక్సిన్ సరఫరా అయింది. దీనికి యూరోపియన్ యూనియన్ నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం కూడా లభించింది. కానీ, అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ మాత్రం ఇంతవరకూ ఆమోద ముద్ర వేయకపోవడంతో ఈ వ్యాక్సిన్ సరఫరా ఆగిపోయినట్టు తెలిసింది.
మే నాటికి ప్రతి వయోజనుడికీ, జూలై నాటికి అమెరికా జనాభా అంతటికీ వ్యాక్సిన్ వేయడానికి వీలుగా మూడు సంస్థల నుంచి ఆ దేశం వ్యాక్సిన్ అందుకుంటోంది. అందువల్ల అమెరికా ఈ వ్యాక్సిన్‌ను తమకు వీలైనంత త్వరగా సరఫరా చేయాలని అమెరికా భాగస్వామ్య, మిత్ర దేశాలు జో బైడెన్ ప్రభుత్వంపై ప్రస్తుతం తీవ్రమైన ఒత్తిడి తీసుకు వస్తున్నాయి.
అమెరికాలో ఉత్పత్తి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోసులను తమకు సరఫరా చేసేందుకు అమెరికాను ఏదో విధంగా ఒప్పించాలని యూరోపియన్ సభ్య దేశాలు గత వారం సమావేశమై నిర్ణయం తీసుకున్నాయి. వ్యాక్సిన్ సరఫరా విషయంలో తాము అమెరికా ప్రభుత్వంతో సంప్రదిస్తూనే ఉన్నామని జర్మన్ ప్రభుత్వం తెలియజేసింది. అయితే, యూరోపియన్ యూనియన్ చొరవ తీసుకుని వ్యాక్సిన్ సరఫరాల కోసం అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందని అది ప్రకటించింది.
డోసుల కోసం తిప్పలు
కాగా, వ్యాక్సిన్ కోసం ఇతర దేశాలను కూడా సంప్రదించాల్సిందిగా బైడెన్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌లు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల ప్రతినిధులకు సూచించారు. వ్యాక్సిన్ సరఫరాల కోసం అట్లాంటిక్ సముద్రానికి అటూ ఇటూ ఉన్న దేశాలనన్నిటినీ సంప్రదించడం మొదలు పెట్టామని యూరోపియన్ కమిషన్ అధికార ప్రతినిధి ఎరిక్ మేమెర్ తెలిపారు.
యూరోపియన్ కమిషన్ నేరుగా ఆస్ట్రాజెనెకా కంపెనీతోనే చర్చలు జరిపినట్టు తెలిసింది కానీ, ఆ అధికార ప్రతినిధి వివరాలను మాత్రం వెల్లడించలేదు. నిజానికి ఆస్ట్రాజెనెకా కంపెనీ అమెరికా ప్రభుత్వంతో ఇదివరకే ఒప్పందం కుదర్చుకున్నందువల్ల అమెరికన్లకు తప్ప ఇతర దేశాలకు తనంతట తానుగా వ్యాక్సిన్ సరఫరా చేసే అవకాశం లేదు.
అమెరికాలో ఏ వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీ అయినా ప్రభుత్వ సహాయం పొందుతున్నప్పుడు మొదటగా తమ వ్యాక్సిన్‌ను అమెరికాలో మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ నియమం ఆస్ట్రాజెనెకాకు కూడా వర్తిస్తుంది. ఆస్ట్రాజెనెకాను అమెరికా ప్రభుత్వం 30 కోట్ల డోసులు కోరింది. ఇది 15 కోట్ల మంది అమెరికన్లకు సరిపోతుంది. అయితే, ఫుడ్ అండ్ డ్రగ్ అధారిటీ కారణంగా దీని సరఫరాకు అవాంతరాలు ఎదురయ్యాయి.
అమెరికా ఫస్ట్ విధానం
అమెరికన్ ప్రభుత్వం నోవావాక్స్ నుంచి కూడా 11 కోట్ల వ్యాక్సిన్ డోసులను కోరింది. ఈ సంస్థ వచ్చే నెలలో ఎమర్జెన్సీ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోదలచుకుంది. మిత్ర దేశాలు ఒత్తిడి తీసుకు వస్తున్నప్పటికీ, అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీలకు ఇతర దేశాలకు సరఫరా చేయడానికి అంగీకరించడం లేదు. పూర్తిగా అమెరికా మీదే వ్యాక్సిన్ కోసం ఆధారపడిన దేశాలు ఇప్పుడు ఇతర దేశాల మీద ఆధారపడాల్సి రావడం ఆ దేశాలకు ఇబ్బందికరంగా పరిణమించింది.
”ముందుగా మా అవసరాలు తీరాలి. మా అమెరికన్లందరికీ వ్యాక్సిన్ పంపిణీ జరగాలి. ఇదే మా ప్రభుత్వ విధానం” అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం కోసం అదనంగా కూడా వ్యాక్సిన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని బైడెన్ భావిస్తున్నట్టు సాకీ తెలిపారు.
”ఏ వ్యాక్సిన్ పిల్లలపై పని చేస్తుందో మాకు తెలియదు. కరోనా వైరస్ మరెన్ని రూపాలలో పుట్టుకు వస్తుందో, ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా వ్యాపిస్తుందో తెలియదు. మేం అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండక తప్పదు. ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ ఈ అంశాలనే పరిగణనలోకి తీసుకుంటోంది” అని ఆమె వివరించారు. ”ముందు అమెరికా ప్రజల అవసరాలు తీరాలన్నదే మా ఉద్దేశం. ఇందులో దాపరికం ఏమీ లేదు” అని కూడా ఆమె పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా, ”మేం సురక్షితంగా ఉంటే సరిపోదు. ప్రపంచమంతా సురక్షితంగా ఉంటేనే అమెరికా కూడా సురక్షితంగా ఉంటుందనే సంగతి మాకు తెలుసు. ఆ దిశలోనే చర్యలు తీసుకుంటున్నాం” అని బైడెన్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ”మా అవసరాలు తీరగానే మేం ప్రపంచ దేశాల అవసరాలు కూడా తీరుస్తాం. ఇందులో సందేహం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
అయితే, యూరోపియన్ యూనియన్ దేశాలకు (27 దేశాల కూటమి) ఈ ధోరణి నచ్చడం లేదు. అమెరికన్లతో పాటే తమకు కూడా వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తారని ఆశించామని అవి పేర్కొన్నాయి. ట్రంప్ ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పటికే తమ సంబంధాలు దెబ్బతిని ఉన్నాయని, అప్పట్లో ఆయన చేపట్టిన ‘అమెరికా ఫస్ట్’ విధానం వల్ల తామెంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగుతున్నట్టు కనిపిస్తోందని యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాలలో ఒక మోస్తరు స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి జరుగుతోంది. అవి తమ పౌరుల అవసరాలను తీరుస్తూనే 3.20 కోట్ల డోసులను ఇతర దేశాలకు ఎగుమతి చేశాయి. విచిత్రంగా ఇందులో 9.5 లక్షల డోసులను అమెరికాకు కూడా సరఫరా చేశాయి. తమ స్థాయిలో తాము ఇతర దేశాలకు సహాయపడుతున్నట్టే, తమకు కూడా అమెరికా వంటి దేశాల నుంచి భారీ స్థాయిలో వ్యాక్సిన్ సహాయం అందాలని ఇవి ఆశిస్తున్నాయి.
సరికొత్త వ్యాక్సిన్ దౌత్యం
కాగా, చైనా, రష్యాలు ఒక పక్క తమ దేశాల ప్రజల అవసరాలను తీరుస్తూనే, వ్యూహాత్మకంగా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నాయి. 45కు పైగా దేశాలకు చైనా 50 కోట్ల డోసులను సరఫరా చేయడానికి నిర్ణయించింది. ఈ ఏడాది తాము 260 కోట్ల డోసులను ఉత్పత్తి చేయబోతున్నట్టు చైనాకు చెందిన నాలుగు ఔషధ కంపెనీలు ప్రకటించాయి. రష్యా కూడా ప్రపంచంలోని అనేక దేశాలకు తమ స్పుట్నిక్ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తోంది. ఒక వైజ్ఞానిక, సాంకేతిక, వితరణశీల దేశంగా గుర్తింపు పొందడానికి రష్యా ఈ అవకాశాన్ని ఒక వ్యాక్సిన్ దౌత్యంగా ఉపయోగించుకుంటోంది. అమెరికా వంటి సంపన్న దేశాలు సైతం ఇతర దేశాలకు సహాయపడని పరిస్థితుల్లో తాము ఆ వెలితిని భర్తీ చేయాలని రష్యా భావిస్తోంది.
దేశంలో సుమారు సగం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన ఇజ్రాయెల్ కూడా రష్యా, చైనాల బాటలోనే వ్యాక్సిన్ దౌత్యానికి అంకురార్పణ చేసింది. నిజానికి, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థల సహాయ సహకారాలు ఉన్న కోవాక్స్ కంపెనీ ద్వారా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ తయారు చేయించి, 90 దేశాలకు సరఫరా చేయడానికి అమెరికా భారీగా ఆర్థిక సహాయం అందజేసింది. కానీ, తమ దేశంలో ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ డోసులను మాత్రం తమ దేశవాసులకే మొదటగా అందజేయాలన్న నిర్ణయాన్ని మాత్రం మార్చుకోవడం లేదు.
తమ దేశాలలో వ్యాక్సిన్ సరఫరా మందకొడిగా సాగుతుండడంతో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు రాజకీయంగా ఇరకాటపడుతున్నాయి. ఔషధ సంస్థలకు కొదవలేని తమ దేశాలలో వ్యాక్సిన్ సరిగ్గా తయారు కాకపోవడం, అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్‌లు ఈ విషయంలో ముందుకు దూసుకుపోతుండడం వాటిని దేశీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అమెరికా 29 శాతం, బ్రిటన్ 35 శాతం ప్రజలకు ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేయగా, యూరోపియన్ యూనియన్ దేశాలు 10 శాతం ప్రజలకు కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేయలేదని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి.