భారత్ బయోటెక్ శుభవార్త చెప్పింది…

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ శుభవార్త చెప్పింది. వ్యాక్సిన్ తీసుకున్న అభ్యర్థుల్లో ప్రతిరక్షకాలను ప్రేరేపించాయని, తీవ్రమైన ప్రతికూల సంఘటనలు నమోదు చేయలేదని మొదటి దశ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలను వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి మందులు అవసరం లేకుండానే తగ్గిపోయినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఫేజ్ 1 ట్రయల్స్ మధ్యంతర ఫలితాల ప్రకారం.. టీకా రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపలేదని పేర్కొంది. జూలై-ఆగస్టు లో 375 మంది వలంటీర్లపై పరీక్షలు నిర్వహించినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ప్రస్తుతం వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా దేశంలోని 25 కేంద్రాల్లో 26 వేల మందిపై పరీక్షలు నిర్వహిస్తోంది. మరోవైపు వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం కంపెనీ డ్రగ్ రెగ్యులేటరీకి దరఖాస్తు చేసింది. కంపెనీ సమర్పించిన వ్యాక్సిన్ డేటాను నిపుణుల కమిటీ సమీక్షిస్తోంది.
వ్యాక్సిన్ భద్రత, పనితీరుపై సంతృప్తి చెందితే దేశంలో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్‌కు అనుమతి లభించనుంది. అయితే కొవాగ్జిన్‌కు డ్రగ్ రెగ్యులరేటరి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ బయోటెక్ సంస్థ కొవిడ్ టీకాను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. గతేడాది డిసెంబర్‌లో మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 99.3 లక్షల వరకు కొవిడ్ కేసులు భారత్‌లో నమోదయ్యాయి. వీటిలో 1.44 లక్షల మంది మృత్యువాతపడగా, ప్రస్తుతం దేశంలో 3.34 లక్షలు ఉన్నాయి. మరో వైపు దేశంలో కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్, ఆరోగ్య కార్యకర్తలు, 50 ఏళ్ల పైబడిన వ్యక్తులకు కరోనా వైరస్ టీకా వేసేందుకు కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ చేసిన ప్రకటన ఆశలు రేకెత్తిస్తోంది.