ఆ దేశంతో చర్చలకు ఎలాంటి షరతులుండవు …అమెరికా
ఉత్తర కొరియాతో చర్చలకు ఏవిధమైన ముందస్తు షరతులు ఉండబోవని అగ్రరాజ్యం అమెరికా తేల్చిచెప్పింది. ఇదే సమయంలో అణ్వస్త్ర రహితంగా మారే క్రమంలో ఉత్తరకొరియా పూర్తి నిబద్ధతతో వ్యవహరించాలని పేర్కొంది. తమ తదుపరి భేటీకి సంబంధించి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నుంచి అందమైన లేఖలు వస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన వారం తర్వాత అట్లాంటిక్ కౌన్సిల్లో ఈ మేరకు ప్రకటన చేసింది. హనోయ్ సమావేశంలో ఏ విధమైన పురోగతి సాధించకపోవడంపై అగ్రహం వ్యక్తం చేసిన కిమ్ తన అధికారులను హత్య చేయించాడంటూ దక్షిణ కొరియా నుంచి వస్తున్న వార్తల ప్రభావం తమపై ఏమీ లేదని ఈ ప్రకటన ద్వారా అమెరికా పరోక్షంగా పేర్కొంది. ఆశించిన మేరకు ఉత్తర కొరియా నుంచి స్పందన ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి సహకరిస్తామంటూ ట్రంప్ ఇప్పటికే ప్రకటన చేయగా, అణ్వస్త్ర నిరాయుధీకరణ పూర్తిగా జరిగే వరకు ఆ దేశంపై విధించిన ఆంక్షలు తొలగింపు సాధ్యంకాదని శ్వేతసౌధం ఓ ప్రకనటలో తెలిపింది.













