2 లక్షలు దాటిన హెచ్-1బీ దరఖాస్తులు
హెచ్-1బీ వీసాల కోసం ఈ ఏడాది దాదాపు 2.10 లక్షల దరఖాస్తులు వచ్చాయని అమెరికా పౌరసత్య, వలసదారుల సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 5 శాతం దరఖాస్తులు పెరిగాయని వెల్లడించింది. త్వరలో లాటరీ తీస్తామని తెలిపింది. నిబంధనల ప్రకారం అమెరికా ఏటా జనరల్ కోటా కింద 65,000 హెచ్-1బీ వీసాలు, మాస్టర్స్ కోటా పేరుతో అమెరికాలో ఎమ్మెస్ చేసిన విద్యార్థులకు మరో 20 వేల వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. మొత్తం 85 వేల వీసాల కోసం ఈ ఏడాది 2.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది మొత్తం 1.90 లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 95.885 మాస్టర్స్ కోటా కింద వచ్చాయి. లాటరీ విధానంలో వీసాలను కేటాయించనున్నారు.
మాస్టర్స్ కోటా కింద వీసా రాని వారికి మరోసారి జనరల్ కోటాలో అదృష్టం పరీక్షించుకునే అవకావం ఉంటుంది. దీంతో మాస్టర్ కోటా దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఏడాది మాస్టర్ కోటా కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయో యూఎస్ సీఐఎస్ అధికారులు వెల్లడించలేదు. కానీ దరఖాస్తుదారులకు వీసా వచ్చే అవకావం 42 శాతం మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు.













