బ్రిటన్ కొత్త వీసా విధానం
యురోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బయటికి వస్తున్న నేపథ్యంలో బ్రిటన్ సరికొత్త వలస విధానాన్ని ప్రకటించింది. నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే తమ దేశంలోకి అనుమతించేలా పాయింట్ల ఆధారిత వీసా విధానాన్ని రూపొందించింది. బ్రిటన్ హోంమంత్రి, ప్రవాస భారతీయురాలు ప్రీతీపటేల్ ఈ విధానాన్ని వివరించారు. ఇది ప్రపంచానికే చారిత్రాత్మకమైన రోజు. బ్రిటన్లోని ఇష్టారీతిన వచ్చివెళ్లే విధానానికి అంతం పలుకుతున్నాం. మా సరిహద్దులను మా ఆధీనంలోకి తీసుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షల మేరకు పాయింట్ల ఆధారిత వలస విధానాన్ని ప్రకటిస్తున్నాం. తద్వారా వలసదారులు తగ్గడంతోపాటు ప్రతిభ ఉన్నవారు, నైపుణ్యం కలిగినవారే బ్రిటన్కు వస్తారు అని ప్రీతీ పటేల్ పేర్కొన్నారు. కొత్త విధానం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు.













