అమెరికా అధ్యక్షుడికి అరుదైన గౌరవం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో ట్రంప్ చారిత్రక భేటీ నేపథ్యంలో, ఇద్దరు నార్వే ఎంపీలు ఆయన పేరును నోబెల్ పురస్కారానికి నామినేట్ చేశారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ కోసం, ఉత్తర కొరియాతో ఒప్పందం చేసుకునేలా ట్రంప్ కృషి చేశారంటూ సదరు ఎంపీలు కొనియాడారు. దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు, శాంతి, నిరాయుధీకరణ దిశగా ట్రంప్ అత్యంత కీలకమైన చర్యలు తీసుకున్నారు అని ట్రంప్ పేరును నామినేట్ చేసిన ఎంపీలు క్రిస్టియన్ టైబ్రింగ్ జేడ్, పెర్-విల్లే అముండ్సేన్ పేర్కొన్నారు. కాగా మేలో అమెరికాలో కొందరు రిపబ్లికను కూడా 2019 సంవత్సరానికి గానూ నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.













