చైనాకు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు
అవసరమైతే మరో 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య చర్చల్లో ఒప్పందం కుదిరితే సరే, లేకుంటే సుంకాల పెంపు తప్పదన్నారు. ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరే ముందు ట్రంప్ తనను కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చైనా దిగుమతులపై సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తానని, తగిన సమయంలో ఆ చర్య తీసుకుంటామని అన్నారు. అయితే ఏయే వస్తువులపై సుంకాలు విధిస్తారన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. చైనా, మెక్సికో, మరే దేశమైనా కానీ వాణిజ్య యుద్ధంలో చివరికి తమ దారికి రావాల్సిందేనని ట్రంప్ అన్నారు. వచ్చే వారం నుండి మెక్సికన్ దిగుమతులపై ఐదు శాతం అదనపు సుంకాలను విధిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.













