అమెరికా ఆ హామీ ఇవ్వాల్సింది కాదు
తాలిబన్ నేతలతో త్వరలోనే సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాలిబన్లు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఆఫ్ఘన్ నుంచి తమ సైనికులను వెనక్కి రప్పించే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఉగ్రవాద ఏరివేత బాధ్యతలను ఇక ఇతరులు చేపట్టే సమయం వచ్చిందని, అది తాలిబన్ కావచ్చు, ఆ చుట్టుపక్కల దేశాలు కావొచ్చని పేర్కొన్నారు. కాగా, శాంతి ఒప్పందానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వచ్చేవారం అప్ఘన్ ప్రభుత్వం, తాలిబన్ మధ్య చర్చలు ప్రారంభం కావాల్సి ఉండగా, తాలిబన్ ఖైదీలను తాము విడుదల చేయబోమని ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రకటించారు. ఖైదీల విడుదల అన్నది చర్చల్లో భాగంగా ఉండాలి కానీ, మందస్తు షరతుగా ఉండకూడదన్నారు. అమెరికా ఆ హామీ ఇవ్వాల్సింది కాదన్నారు.













