వారికి ఈ నిషేధం వర్తించదు : ట్రంప్
అమెరికాలోకి తాత్కాలిక వలసల నిషేధం నుంచి వైద్య సిబ్బందికి, పెట్టుబడిదారులకు మినహాయింపు ఇచ్చారు. కరోనా సంక్షోభంతో ఆర్థిక వ్యవస్ధ దిగజారిన నేపథ్యంలో అమెరికన్లకు ఉద్యోగ రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో తాత్కాలిక వలసలపై 60 రోజుల పాటు నిషేధం విధించే ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. అమెరికా ఉద్యోగులను కాపాడేందుకు వలసల్ని తాత్కాలికంగా నిషేధించే ఉత్తర్వులపై ఇప్పుడే సంతకం చేశాను. ఇది చాలా శక్తి వంతమైన ఉత్తర్వు అని మీడియాకు తెలిపారు. ఈ ఉత్తర్వు జారీ చేసిన నాటికి ధ్రువీకరించిన ఇమ్మిగ్రేషన్ వీసా లేని వారి తోపాటు వీసా ఉన్నప్పటికీ ప్రయాణ అనుమతి పత్రం లేని విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.
మరోవైపు కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. దేశంలోని గ్రీన్‌కార్డు కలిగిన విదేశీయులు, వైద్య రంగానికి చెందిన వారు, పెట్టుబడుల కేటగిరి ద్వారా అమెరికాలో చట్టపరంగా శాశ్వతంగా నివాసం ఉండాలనుకునేవారికి, అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, 21 ఏండ్ల కన్నా తక్కువ వయసున్న అమెరికా జాతీయులు, లేదా వారిని దత్తతు తీసుకునే వారికి ఈ నిషేధం వర్తించదు.













