ఉమ్మడి పోరాటంతోనే ఇది సాధ్యం.. ప్రపంచ నేతలకు ట్రంప్ పిలుపు
ప్రపంచానికి పక్కలో బల్లెంలా పరిణమించిన మత్తు జగత్తును అంతం చేద్దామని ప్రపంచ దేశాల నేతలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలను సరఫరాచేసే మాఫియాల పీచమణిచి, డ్రగ్స్ బానిసలకు విముక్తి కలిగిద్దామన్నారు. ఉమ్మడి పోరాటంతోనే ఇది సాధ్యమని నొక్కి చెప్పారు. అమెరికా నేతృత్వాన మాదక ద్రవ్యాల నియంత్రణపై ఐరాస ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. భారత్ సహా 130 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ట్రంప్ ఉపన్యసించారు. మత్తు మహమ్మారిని ఆనవాళ్లు లేకుండా పెరికేయాలి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో వ్యవస్థీకృత నేరాలకు, అక్రమ డబ్బు ప్రవాహానికీ, అవినీతికి, ఉగ్రవాదానికి సంబంధముంది. మాఫియాలకు ఆర్థిక దన్నుగా ఉంటున్న అన్ని రకాల అక్రమ రవాణా, తప్పుడు మార్గాల్లో వస్తువుల చేరవేతను కలిసికట్టుగా అడ్డుకుందాం. మత్తు పదార్థాల ఉత్పత్తిపై దేశాలన్నీ ఉక్కుపాదం మోపాలి. వీటికి అలవాటు పడినవారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, వారికి విముక్తి కల్పించాలి. ఈ పోరాటానికి ఈరోజే అంకితమవుదాం అని పేర్కొన్నారు.













